Nehru autobiography in telugu pdf

జవాహర్ లాల్ నెహ్రూ

జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

తొలినాళ్ళు

జననం, కుటుంబ నేపథ్యం

జవాహర్‌లాల్ నెహ్రూ బ్రిటీష్ ఇండియాలోనియునైటెడ్ ప్రావిన్సులోనిఅలహాబాదు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో భాగం) నగరంలో 1889 నవంబరు 14న రాత్రి 11.30 గంటలకు కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ సంపన్నుడైన బారిస్టర్, తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని రెండు మార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పనిచేశాడు.

తల్లి స్వరూపరాణి తుస్సు లాహోర్‌లో స్థిరపడ్డ కాశ్మీరీ పండిట్‌ కుటుంబానికి చెందినది. మోతీలాల్ మొదటి భార్య బిడ్డను ప్రసవిస్తూ, బిడ్డతో సహా చనిపోగా స్వరూపరాణిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జవాహర్‌లాల్ తొలి సంతానం.[3]

జవాహర్‌లాల్ నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్‌కు చెందినవారైనా తరాల క్రితం రాజ్‌కౌల్ అన్న పూర్వీకుడు ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డాడు.

నెహ్రూ వంశస్థులు ఢిల్లీలో మొఘల్ పాలకుల ఆదరాభిమానాలకు పాత్రులై ఉన్నతస్థితి, ఆర్థికాభివృద్ధి పొందారు. కౌల్ అన్న అసలు వంశం పేరుకు తోడు నెహ్రూ అన్న మరొక వంశనామం కూడా చేర్చి కౌల్-నెహ్రూగా పెట్టుకునేవారు. క్రమేపీ కౌల్ అన్నది పోయి నెహ్రూ స్థిరపడింది.[నోట్స్ 1] మోతీలాల్ నెహ్రూ తండ్రి అతను జన్మించడానికి కొద్ది నెలల ముందే మరణించినా, అప్పటికే భారతీయ సంస్థానాల్లో ఉన్నతోద్యోగులైన అన్నలు అతన్ని చదివించారు.

మోతీలాల్ నెహ్రూ న్యాయవాదిగా మంచి పేరు సంపాదించి, బాగా సంపద ఆర్జించాడు. జవాహర్‌లాల్ జన్మించడానికి మూడేళ్ళ ముందే మోతీలాల్ కుటుంబం, ఆయన వృత్తి రీత్యా, కాన్పూర్ నుంచి అలహాబాద్ చేరుకుని స్థిరపడింది.

జవాహర్‌లాల్ నెహ్రూ పుట్టేసరికే కుటుంబం భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండేది. తల్లి స్వరూపరాణి ప్రభావంతో ఇంట్లో భారతీయ సంప్రదాయాలు, పండుగలు పబ్బాలు జరిగేవి.

స్త్రీల నుంచి జవాహర్‌లాల్, అప్పటి భారతీయులందరిలానే, పురాణగాథలు, జానపద కథలు విన్నాడు. గంగాస్నానం, దైవదర్శనం వంటివి తల్లి జవాహర్‌తో చేయించేది. జవాహర్ జననం నాటికే తండ్రి పేరొందిన న్యాయవాది, తర్వాతి కాలంలో బ్రిటీష్ బారిస్టర్ అయిన మోతీలాల్ నెహ్రూ బ్రిటీష్ పెద్దమనిషి తరహాలో వ్యవహరించేవాడు. ఇంటిలో విలాసవంతమైన ఈతకొలను, టెన్నిస్ కోర్టు వంటివి ఉండేవి.

ఇలా కొన్ని భారతీయ, మరికొన్ని ఆంగ్లేయ పద్ధతులు కలిగిన ఈ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం, అప్పటి అలహాబాద్ హిందూ అగ్రవర్ణ జీవనంలో పూర్తిగా కలవలేదు. అలహాబాద్‌కి కొత్తవారు కావడం, కాశ్మీరీ పండిట్లకు సహజంగా కొంత ఆచార వ్యవహారాల్లో పట్టింపు తక్కువ కావడం[నోట్స్ 2] వంటి కారణాలకు మోతీలాల్ 1899లో సముద్రయానం చేసివచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోకపోవడం తోడుకావడంతో వీరి కుటుంబాన్ని అలహాబాద్ బ్రాహ్మణులు వెలివేశారు.

కాశ్మీరీ పండితుల్లో కూడా కాస్త చాందసంగా ఉండే కుటుంబాలకు నెహ్రూ కుటుంబం దూరంగానే ఉండేది. వెరసి ఈ కుటుంబం మతాచారాల విషయంలో పట్టింపు చూపేది కాదు.

బాల్యం

సుసంపన్నమైన కుటుంబంలో తల్లిదండ్రుల తొలి సంతానం కావడంతో జవాహర్‌లాల్ బాల్యం ముద్దుమురిపాల నడుమ, అతిగారాబంగా సాగింది. జవాహర్‌లాల్‌ను తండ్రి కొద్దినెలల పాటు స్థానిక కాన్వెంటుకు పంపి ఆ ప్రయత్నం విరమించి, ఇంట్లోనే ప్రైవేటుగా చదివించడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు.

అతనికి మహాపండితుడైన గంగానాథ ఝా సంస్కృత విద్య, అనీ బిసెంట్ సూచించిన ఫెర్డినాండ్ టి. బ్రూక్స్ అనే దివ్యజ్ఞాన సమాజ యువకుడు ఆంగ్ల విద్య బోధించేవారు. తండ్రి ఆంగ్ల విద్యకే ప్రాధాన్యం ఇచ్చాడు, అందుకు అనుగుణంగానే జవాహర్‌కి సంస్కృత విద్య ఒంటబట్టలేదు.[నోట్స్ 3] బ్రూక్స్ అతనికి విజ్ఞానశాస్త్రం పట్ల ప్రాథమిక అవగాహన, దివ్యజ్ఞాన సమాజ తాత్త్వికత పట్ల ఆసక్తి, ఆంగ్ల కవిత్వం, సాహిత్యం, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి పలు అంశాలను పరిచయం చేశాడు.

దివ్యజ్ఞాన సమాజం పరిచయం నెహ్రూకు బౌద్ధ, హిందూ మతగ్రంథాల పట్ల ఆసక్తి కలిగించి అధ్యయనానికి పురిగొల్పింది. మూడు సంవత్సరాల పాటు బ్రూక్స్ నెహ్రూకు ట్యూటర్‌గా వ్యవహరించాడు.[8] అతని గురించి తర్వాతికాలంలో నెహ్రూ మాట్లాడుతూ "దాదాపు మూడేళ్ళు (అతను) నాతో ఉన్నాడు. ఎన్నో విధాలుగా అతను నన్ను గొప్పగా ప్రభావితం చేశాడు" అన్నాడు.[9]

పాఠశాల విద్యాభ్యాసం

మోతీలాల్ జవాహర్‌లాల్ ప్రైవేటు విద్యను ముగింపజేసి, 1905 మే నెలలో కుటుంబ సమేతంగా బ్రిటన్ వెళ్ళి ప్రతిష్ఠాత్మక హేరో పాఠశాలలో కుమారుడికి ప్రవేశం సంపాదించాడు.

హేరోలో ప్రతిభా పాటవాలు చూపి పేరుతెచ్చుకున్నా, క్రమేపీ హేరో పాఠశాల జీవితం అతన్ని విసుగెత్తించింది. హేరో పాఠశాల విద్యాకాలం మొత్తం మీద అధికారుల శిక్షణ కోర్‌ మాత్రం అతన్ని ఆకట్టుకుని, ఉత్సాహభరితంగా పాల్గొనేలా చేసింది. మరోవైపు 1905లో భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు అతనికి ఆసక్తి కలిగించడం ప్రారంభించాయి.

1905లో జరిగిన బెంగాల్ విభజన, అది బెంగాల్‌లోని జాతీయోద్యమాన్ని బలహీనపరిచే చర్యగా ఆందోళనలు పెరుగుతూండడం, ఆ ఆందోళనలు కాంగ్రెస్ పార్టీలో అతివాదులు, మితవాదుల విభజన సృష్టించడం వంటి పరిణామాలను జవాహర్‌లాల్ ఆసక్తిగా పరిశీలించసాగాడు. తండ్రికి ఉత్తరాలు రాసి ఎప్పటికప్పుడు వార్తాపత్రికలు తెప్పించుకుంటూ ఉండేవాడు. ఆ దశలో అతనికి అతివాదుల మీద సానుభూతి ఏర్పడింది.

మరోవైపు షుషిమా వద్ద నౌకాయుద్ధంలో రష్యాపై జపాన్ ఘనవిజయం సాధించిందన్న వార్త అతనిని చాలా సంతోషపరిచింది. ఆసియా దేశాలు ఐరోపా వలసపాలనలో మగ్గుతూ ఉన్న ఆ దశలో తోటి ఆసియా దేశమైన జపాన్ ప్రదర్శించిన సైనిక పాటవం, శక్తి సామర్థ్యాలు అతనికి ఉత్సాహం కలిగించాయి. హేరో పాఠశాలలో అతని విద్యావిషయమైన ప్రతిభకు బహుమతిగా బ్రిటీష్ చరిత్రకారుడు జి.

ఎం. ట్రావెల్యాన్ ఇటలీ జాతీయవాది, సైన్యాధ్యక్షుడు అయిన గారిబాల్డ్ గురించిన పుస్తకాలు లభించాయి. ఇవి జవాహర్‌లాల్‌ను ప్రభావితం చేశాయి. తన మనసులో భారతదేశ స్వేచ్ఛ కోసం అద్భుతమైన పోరాటాలు చేసినట్టు కొన్ని దృశ్యాలు తళుక్కుమనేవని, ఆ పుస్తకాలు చదివేప్పుడు ఆలోచనల్లో అతను వర్ణించే ఇటలీ, తన మాతృభూమి భారతదేశం గొప్పగా కలగలిసిపోయేవని జవాహర్‌లాల్ పేర్కొన్నాడు.[9]

కేంబ్రిడ్జి విద్యాభ్యాసం

జవాహర్‌లాల్ 1907లో కేంబ్రిడ్జి ప్రవేశపరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడై, ఆ సంవత్సరం అక్టోబరు నెలలో ట్రినిటీ కళాశాలలో చేరాడు.

ప్రవేశపరీక్షకు, ట్రినిటీ ప్రవేశానికి మధ్యలో వేసవి కాలంలో కొన్ని వారాల పాటు ఐర్లాండును సందర్శించాడు. స్వయంపాలన కోసం పోరాటం చేస్తున్న ఐర్లాండు అతని ఆసక్తిని చూరగొంది. క్రియాశీలంగా ఆందోళనలు చేస్తున్న ఐరిష్ అతివాద ఆందోళనలు అతనికి నచ్చాయి. ఈ దశలో అతను తండ్రికి రాసే ఉత్తరాల్లో జాతీయవాద ఉద్యమాలు, వాటిలో ప్రత్యేకించి అతివాదం పట్ల తనకు ఏర్పడుతున్న అభిమానాన్ని వెల్లడించేవాడు.[13] కేంబ్రిడ్జిలో అతను రసాయనశాస్త్రం, భూవిజ్ఞాన శాస్త్రం, భౌతికశాస్త్రాలను అధ్యయనాంశాలుగా స్వీకరించి కొన్నాళ్ళకే భౌతికశాస్త్రాన్ని విడిచిపెట్టి వృక్షశాస్త్రం స్వీకరించాడు.

కేంబ్రిడ్జిలో జవాహర్‌లాల్ అంతగా శ్రమించి చదవలేదు. యువకులకు ఉత్సాహభరితంగా ఉండే కేంబ్రిడ్జి వాతావరణం అతని నిరాసక్తతను మార్చలేకపోయింది. ఆ దశలో జవాహర్‌లాల్‌కి టెన్నిస్ ఆట, గుర్రపుస్వారీ, పందెపు పడవల జట్టులో ఆడడం వంటి వ్యాపకాలు ఉండేవి కానీ ఆ వ్యాపకాలు వేటిలోనూ పూర్తి అభినివేశం కానీ, మంచి ఉత్సాహం గానీ చూపించలేదు. ఫైనల్ ట్రైపోన్ పరీక్షలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడైనవారిలోనూ అతని పేరు కింది వరుసలోనే వచ్చింది.

అలా 1910లో ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఈ దశలో అతను రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం చదువుకున్నాడు. జార్జి బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, జె.ఎం.కీన్స్, బెర్ట్రాండ్ రస్సెల్, లూయీస్ డిక్సన్, మెరెడిత్ టౌన్సెండ్ వంటి వారి రచనలు అతని రాజకీయ, ఆర్థిక చింతనపై ప్రభావం చూపాయి.[9]

న్యాయవిద్యాభ్యాసం

కేంబ్రిడ్జిలో ఫైనల్ ట్రైపోన్ పరీక్షకు ముందే ఇన్నర్ టెంపుల్‌లో చేరాడు.

ఇన్నర్ టెంపుల్ అన్నది న్యాయవిద్య అభ్యసించి బారిస్టర్ కావడానికి అవసరమైన నాలుగు ఇన్‌లలో ఒకటి. కనీసం న్యాయవిద్య తన కుమారుడి ఆసక్తిని చూరగొందని, ఇకపై ఉత్సాహంగా చదువుతాడని మోతీలాల్ నమ్మాడు. కానీ తన ఇష్టంతో ప్రమేయం లేకుండా సాగుతున్న తన జీవితం పట్ల ఆనాసక్తితో ఉన్న జవాహర్‌లాల్ న్యాయవిద్యాభ్యాసంలోనూ పెద్ద చురుకుదనం, ఉత్సాహం ప్రదర్శించలేదు.. ఇన్నర్ టెంపుల్‌లోని రెండేళ్ళ కాలంలో జవాహర్‌లాల్ ప్రాణానికి ప్రమాదమైన సాహసకార్యాలు చేశాడు, పాత మిత్రులను తిరిగి కలిశాడు, ఫాషన్లు అనుసరించాడు, అప్పులు చేశాడు.

ఇలా లండన్ జీవితంలోని సందడి చవిచూశాడు. అంతేతప్ప విద్యాభ్యాసంలో మంచి పట్టుదల కనబరచలేదు. ఫలితంగా 1912లో స్కాలర్‌షిప్‌లు, బహుమానాలు వంటివి ఏమీ సాధించకుండా బార్ ఎట్ లా పరీక్షల్లో సాధారణంగా ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటికి ఇంగ్లాండులో ఏడేళ్ళ విద్యాభ్యాసం పూర్తిచేసుకుని భారతదేశానికి తిరిగివచ్చాడు. భారతదేశం తిరిగివచ్చేనాటికి అతని మనస్సు, బుద్ధి ఒక వృత్తి కోసం కాక, భవిష్యత్తులో రాబోయే పిలుపును అందుకోవడానికి సంసిద్ధంగా తయారైంది.

నెహ్రూ జీవితచరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ ప్రకారం జవాహర్‌లాల్ విద్యభ్యాసం ముగించుకుని భారతదేశానికి తిరిగివచ్చేనాటికి చక్కని శిక్షణ పొందిన మనస్సు, మంచి భావనాశక్తితో పాటుగా జీవితాంతం శాశ్వతంగా అంటిపెట్టుకున్నవి మరో రెండు తెచ్చుకున్నాడు: అవి బ్రిటన్ పట్ల ప్రేమాభిమానాలు, బ్రిటీష్ విలువలు.

న్యాయవాద వృత్తిలో

బారెట్లా ఉత్తీర్ణుడై ఇన్నర్ టెంపుల్‌లో బారిస్టరుగా నమోదుకాగానే న్యాయవాద వృత్తిని అవలంబించడానికి 1912 ఆగస్టులో భారతదేశానికి తిరిగి వచ్చాడు.

జవాహర్‌లాల్ అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకుని, తండ్రి ప్రాక్టీసులో సహ న్యాయవాదిగా వృత్తి ప్రారంభించాడు. తండ్రి వలె కాక జవాహర్‌లాల్‌ న్యాయవాద వృత్తిలో పెద్ద ఆసక్తి కనబరచలేదు. తత్ఫలితంగా అతను న్యాయవాదిగా పెద్దగా రాణించిందీ లేదు, తోటి న్యాయవాదుల సాంగత్యంలో ఇమడగలిగినదీ లేదు. న్యాయవాదిగా ప్రాక్టీసుచేసిన రోజుల గురించి జవాహర్‌లాల్ మొత్తం మీద ఆ వాతావరణం మేధోపరంగా ఉత్తేజితంగా ఉండేది కాదని, తనకు జీవితం పట్ల విపరీతమైన నిరాసక్తత పెరిగిపోయిందని పేర్కొన్నాడు.

తండ్రి జవాహర్‌లాల్‌కు కక్షిదారులను తీసుకువచ్చేవాడు. జవాహర్ క్రమశిక్షణతోనే కేసులను నడిపేవాడు. కానీ జీవితోత్సాహం లోపించేది. బ్రిటన్‌లో ఉన్నకాలంలో అతను జాతీయవాదంపైనా, అతివాదంపైనా చూపిన ఆసక్తి క్రియారూపంలోకి రాలేదు. ఈ దశలో సంపన్న పాశ్చాత్య ప్రభావితమైన భారతీయ జీవనంలో ఇమిడిపోవడానికి అదేమీ అడ్డురాలేదు. జవాహర్ ఈ దశలో కొంతమేరకు సామాజిక సేవ కూడా చేసేవాడు.

వాటిలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యమానికి మద్దతుగా నిధుల సేకరణ ఒకటి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యమాలకు సూత్రప్రాయంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వ సానుభూతి ఉండేది కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు. జవాహర్‌లాల్ ఈ క్రమంలో ముందుకుపోయి బ్రిటీష్ పారామిలటరీలో చేరి, తోటి భారతీయ యువకులను ఆ దళంలో చేర్చడానికి అవసరమైన ప్రయత్నాలు చేసేవాడు. అప్పటికే అంతరంగంలో జాతీయవాద పోరాటాలు, అతివాద ఉద్యమాల పట్ల ఆరాధనాభావం ఉన్నా, ఈ దశలో అతని క్రియాశీల రాజకీయ అవగాహన దయాళువులైన బ్రిటీష్ వారు భారతీయుల న్యాయమైన కోర్కెలు తీరుస్తారన్న నమ్మకానికి పరిమితమై ఉండేది.

సహాయ నిరాకరణోద్యమం నుంచి పూర్ణ స్వాతంత్ర్యం వరకు (1919 - 1930)

ప్రధాన వ్యాసం: భారత స్వాతంత్ర్యోద్యమంలో జవాహర్ లాల్ నెహ్రూ

రాజకీయాల్లోకి ప్రవేశం: రెండవ ప్రపంచయుద్ధం, హోంరూల్ లీగ్

అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో తండ్రి చాటు న్యాయవాదిగా పనిచేస్తున్న జవాహర్‌లాల్ తండ్రితో పాటుగా 1912లో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు హాజరయ్యాడు.

జీవితకాలం పాటు అనుబంధం పెంచుకున్న ఆ సంస్థ అప్పటి దశలో చేస్తున్న రాజకీయాలు జవాహర్‌లాల్‌కు కనీస ఆసక్తి కలిగించలేదు. అతనికి ఆ సమావేశాలు - "ఇంగ్లీషు తెలిసిన ఉన్నత వర్గాల వ్యవహారంగా మాత్రమే" అనిపించాయి. ఆ దశలో కాంగ్రెస్ దాదాపుగా మితవాద రాజకీయ నాయకులతో నిండి ఉండేది. మొదటి ప్రపంచయుద్ధం వచ్చిన ఆ దశలో తనకు ఒక స్పష్టమైన వైఖరి లేదని జవాహర్ తర్వాతి దశలో అంగీకరించాడు.

నెహ్రూ జీవితచరిత్రకారుల్లో ఒకడైన ఫ్రాంక్ మోరిస్ రాసినదాని ప్రకారం "అతని (జవాహర్‌లాల్) సానుభూతి ఏ దేశంతో అయినా ఉందంటే అది ఫ్రాన్స్. ఫ్రెంచి సంస్కృతి పట్ల అతనికి ఎంతగానో గౌరవం ఉండేది." యుద్ధసమయంలో జవాహర్ "సెయింట్ జాన్స్ అంబులెన్స్"కు స్వచ్ఛంద సేవకునిగా ఉన్నాడు. అలహాబాదులో సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీసు వారి ప్రాంతీయ కార్యదర్శుల్లో అతను ఒకడు. కానీ ప్రభుత్వం అమలు చేసిన సెన్సార్‌షిప్ బిల్లులను వ్యతిరేకించాడు.

1917లో ప్రాంతీయ సైన్యం నమూనాలో తయారుచేసిన భారతీయ రక్షణదళంలో చేరడానికి తన సమ్మతిని తెలియజేశాడు. తనవంటి యువకులను అందులో చేరేలా ప్రోత్సహించే కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంసిద్ధుడైనాడు.

కాంగ్రెస్ సంస్థలో అతివాదులకు ప్రవేశం ఇప్పించే ప్రయత్నాలు బెడిసికొట్టి మితవాదులు విజయం సాధించడంతో బాలగంగాధర తిలక్, అనీ బిసెంట్ హోంరూల్ లీగులు స్థాపించారు.

స్వయంపాలన ఆవశ్యకతను ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపించారు. ప్రభుత్వం అనీబిసెంట్‌ని బొంబాయి, సెంట్రల్ ప్రావిన్సుల నుంచి బహిష్కరించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఎందరో విద్యావంతులు, అనీబిసెంట్ అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. అలా ప్రభుత్వ చర్యలను నిరసించినవారిలో జవాహర్‌లాల్ ఒకడు. ప్రతిస్పందనగా తాను భారతీయ రక్షణదళంలో చేరడానికి చేసిన దరఖాస్తు ఉపసంహరించుకుని, దళంలో చేరేలా ఇతరులను ప్రోత్సహించేందుకు నిర్వహించబోయిన సభ రద్దుచేశాడు.

మోతీలాల్ అధ్యక్షతన జవాహర్‌లాల్ ఒకానొక కార్యదర్శిగా యునైటెడ్ ప్రావిన్సుల హోంరూల్ లీగ్ ఏర్పాటుచేశారు. అయితే హోంరూల్ సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విషయంలో జవాహర్‌లాల్‌కి స్పష్టత లేదు. హోంరూల్ నాయకులైన అనీబిసెంట్ ఆంగ్లో-సాక్సన్ పద్ధతి కానీ, తిలక్ తీవ్రమైన అతివాదం కానీ అతన్ని ఆకర్షించలేదు. అలాగని స్వంతంగా తనే కార్యాచరణ ఏర్పురుచుకోగల స్పష్టత కూడా లేదు.

సిరిసంపదల వల్ల దేశప్రజలకు సేవచేయగల స్థితిలో ఉండి కూడా తండ్రి స్థాపించిన ఇండిపెండెంట్ పత్రిక నిర్వహణలో సహకారం తప్ప మరేమీ చేయలేకపోతున్నందుకు అసంతుష్టితో గడిపేవాడు.

సహాయ నిరాకరణోద్యమంలోకి

1919లో రౌలట్ చట్టం అమలులోకి రావడం, జలియన్ వాలాబాగ్ దురంతం జరగడం జవాహర్‌లాల్‌లో పెద్ద పరివర్తనానికి కారణమయ్యాయి.

జలియన్‌ వాలాబాగ్ దురంతాన్ని గురించి నివేదించడానికి ఏర్పరిచిన కాంగ్రెస్ కమిటీకి జవాహర్‌లాల్ సహకరించేందుకు అమృత్‌సర్ సందర్శించాడు. ప్రత్యేకించి జలియన్ వాలాబాగ్ దురంతం పట్ల ఇంగ్లండులో వ్యక్తమైన అభిప్రాయం అతన్ని కలతపెట్టింది. సర్వేపల్లి గోపాల్ ఈ దశలో వచ్చిన మార్పు గురించి - " (అంతవరకు) దయాసముద్రులైన బ్రిటీష్ పాలకులవల్ల ఉపకారం, మేలు జరుగుతాయని (జవాహర్‌లాల్) ఆశిస్తూ ఉన్నాడు.

కాని స్వాతంత్ర్యమనేది ఒకరు ఆదరభావంతో ఇచ్చే కాన్క కాదనీ, ప్రతిఘటించి పోరాటం సల్పినందువల్ల దక్కే ఫలితమనీ దేశంలో సర్వసాధారణంగా చాలామందికి కనువిప్పు కలిగింది. దాని పర్యవసానమే జవహర్‌లో వచ్చిన పెద్ద పరివర్తనం." అని రాశాడు. 1920లో పలువురు భారతీయ జాతీయోద్యమ నాయకులు, కార్యకర్తల వలెనే జవాహర్‌లాల్ ను కూడా గాంధీ భావాలు, కార్యాచరణ విపరీతంగా ఆకర్షించాయి.

గాంధీ పిలుపును అనుసరించి సహాయ నిరాకరణోద్యమంలో తన కృషి ప్రారంభించాడు. జవాహర్‌లాల్ యునైటెడ్ ప్రావిన్సుల్లో సహాయ నిరాకరణోద్యమాన్ని నిర్వహించే బాధ్యత స్వీకరించాడు. యుపిలో ప్రముఖుడైన కాంగ్రెస్ నాయకుడిగా అతికొద్ది కాలంలోనే పేరు సంపాదించాడు.

1920 జూలై నుంచి అలహాబాద్ జిల్లాకు ఉత్తరాన ఉన్న ప్రతాబ్‌గఢ్ జిల్లాలో జమీందార్లు చిత్తం వచ్చినట్టు కౌళ్ళు, జరిమానాలు, నజరానాలు విధిస్తూండడంతో తిరగబడ్డ వెనుకబడ్డ కుర్మీ కులానికి చెందిన రైతుల పోరాటానికి జవాహర్‌లాల్ నాయకత్వం వహించాడు.

రైతుల కోర్కెలకు న్యాయబద్ధమైన స్పష్టమైన రూపం ఇచ్చి, వారిని అహింసవైపు మళ్ళించి, వారి సమస్యలను వెల్లడించేందుకు కిసాన్ సభలను ఏర్పాటుచేశాడు. మరోవైపు రైతులను అక్రమంగా అరెస్టు చేసిన బ్రిటీష్ అధికారులతో సంప్రదింపులు జరిపాడు. రైతుల్లోని క్రమశిక్షణ, వారికి జవాహర్ నాయకత్వం పట్ల గౌరవం అతన్ని కదిలించాయి. ప్రతాబ్‌గఢ్ ప్రాంతంలో ఒకచోట సభలో తాను ప్రసంగిస్తూండగా జనంలో చిన్న కలకలం రేగింది.

మాట్లాడకున్నా వారిలో వారే తోసుకోవడం, మోచేతులతో పొడుచుకోవడం కనిపించింది. ఆగ్రహించి అదేమని ప్రశ్నిస్తే - అక్కడొక పాము ఉందని, ప్రాణభయం ఓవైపు ఉన్నా కూడా క్రమశిక్షణ తప్పకుండా అలా మౌనంగానే ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారని తెలిసింది. మూడున్నర దశాబ్దాల తర్వాత గుర్తుచేసుకునేంతగా జవాహర్ మీద ఈ సంఘటన ముద్రవేసింది. జమీందార్ల విధానాలకు తోడు ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల 1921 సంవత్సరంలో హింసాత్మకమైన రైతాంగ ఆందోళన అవధ్ అంతటా వ్యాపించింది.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో పోలీసుల దాడులు, నాయకుల అరెస్టుల వల్ల రెచ్చిపోతున్న గుంపుల ఎదుట నిలిచి జవాహర్ వారికి సాహసోపేతంగా అహింస బోధించి శాంతపరిచాడు. ప్రభుత్వం ఒకపక్క సహాయనిరాకరణ ఉద్యమ నాయకులైన గాంధీ, నెహ్రూ వంటివారి పట్ల అనుమాన దృక్కులతో చూస్తూనే, ఉద్యమ నాయకత్వం కౌళ్ళు చెల్లించమని సూచించే జవాహర్‌లాల్, గాంధీ వంటివారి చేతిలో ఉండాలని, ఏమీ చెల్లించవద్దని ఆజ్ఞాపించే సాధువుల చేతిలో ఉండరాదని ఆశించారు.

పన్నులు, కౌళ్ళ చెల్లింపు నిరాకరించమనే నాయకులను క్రమేపీ ప్రభుత్వం అరెస్టు చేసి, రైతు ఉద్యమ నాయకత్వాన్ని పూర్తిగా కాంగ్రెస్ పాలు చేసింది. జవాహర్ సహా కాంగ్రెస్ వారు రైతు సమస్యల మీద తక్కువగా వ్యవస్థా నిర్మాణం, నిధుల వసూళ్ళపై ఎక్కువగా కేంద్రీకరించడంతో ప్రభుత్వానికి వీలుచిక్కింది. తర్వాతి దశలో రైతాంగం మరో రాజకీయ ఆందోళన అయిన ఏకా ఉద్యమం ప్రారంభించింది.

జవాహర్ వేరే పనిలో మునిగి, ఈ ఉద్యమంలో పాల్గొనకుండా ఉండిపోయాడు. అంతటితో ఆ రైతు ఉద్యమంలో జవాహర్ అనుబంధం ముగిసింది.

1921లో నెహ్రూ ఒకపక్క అఖిలభారత కాంగ్రెస్ వ్యవహారాల్లోనూ, ఇటుపక్క స్వంత రాష్ట్రంలోని కార్యాచరణలోనూ ఆసక్తిగా పాల్గొనసాగాడు. అలహాబాద్ జిల్లాలో కనీసం 50వేల మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్పించాలని, ప్రత్యేకించి స్త్రీలను హెచ్చుసంఖ్యలో చేర్చాలని లక్ష్యం నిర్ణయించుకున్నాడు.

సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాలను బలపరచడానికి యునైటెడ్ ప్రావిన్సుల్లోని జిల్లాలంతటా పర్యటనలు ప్రారంభించాడు. అనేక కార్యక్రమాలు, సభలు నిర్ణయించుకుని వాటికై విస్తారంగా ప్రయాణాలు చేశాడు. ఒకదశలో తాను చేరుకోవాల్సిన సభ కోసం రెండు ఊళ్ళ మధ్య పరుగులు కూడా పెట్టాడు. మరో సందర్భంలో తప్పిపోయిన రైలును అందుకునేందుకు పక్క స్టేషనుకు రైల్వే ట్రాలీలో ప్రయాణించాడు.

1920, 21ల్లో స్వరాజ్యం సాధించడానికి స్వదేశీ వస్తువులు, దుస్తులు వినియోగించడమే ఏకైక మార్గమన్న అభిప్రాయంలో ఉండేవాడు. విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వరాజ్య నిధికి విరాళాల సేకరణ మంచి ఉత్సాహంతో చేస్తూండేవాడు. ప్రభుత్వాజ్ఞలను పూర్తిగా లెక్కచేయని మనస్థితి రాలేదు. సభల విషయంలో నిషేధాజ్ఞలు పాటించేవాడు. అయితే ప్రభుత్వం హింసను ప్రేరేపించే రచనలు చేయనని పూచీ ఇమ్మని కోరగా, ప్రభుత్వానికి క్షమాపణ కానీ, పూచీ కానీ ఇవ్వనని నిరాకరించాడు.

1921 డిసెంబరు 5న యునైటెడ్ ప్రావిన్సు స్వచ్ఛంద సేవకుల వ్యవస్థను చట్టవిరుద్ధమని ప్రకటించి, దాని కార్యదర్శి జవాహరలాల్‌ను, ఈ కార్యకలాపాలతో సంబంధం ఉన్న తండ్రి మోతీలాల్‌ను అరెస్టు చేశారు. జవాహర్‌లాల్‌కు ఆరునెలల సాధారణ జైలుశిక్ష, రూ.100 జరిమానా, అది చెల్లించకుంటే మరో నెల శిక్ష విధించారు. జవాహర్ అధికారులు అణచివేస్తున్నా, తాను నిర్బంధంలో ఉన్నా జైలు నుంచే యుపి కాంగ్రెస్ పని కొనసాగించాడు.

ఏవో సాంకేతిక కారణాలతో సగం శిక్ష అనుభవించగానే 1952 మార్చిలో జవాహర్‌ని విడుదల చేశారు. చౌరీచౌరా సంఘటన వంటి హింసాత్మక ఘటనలు ఎక్కువ అవుతున్నాయన్న కారణంగా మహాత్మా గాంధీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జవాహర్‌లాల్ వంటి పలువురు కాంగ్రెస్ నాయకులకు ఆశాభంగం అయింది.

రెండు జైలు శిక్షలు, పార్టీ చీలకలతో మధ్యవర్తిత్వం (1922-1923)

మహర్షి వంటివాడైన మా ప్రియతమ నాయకుని(గాంధీ)కి శిక్ష విధించిన తర్వాత జైలు మాకు స్వర్గమైంది.

పవిత్రమైన యాత్రా స్థలమైంది.... నా అదృష్టానికి నేనే అబ్బురపడుతున్నాను.

— న్యాయస్థానంలో జవాహర్‌లాల్ నెహ్రూ ప్రకటనలో భాగం

సహాయ నిరాకరణోద్యమం ఆపేయాలని మహాత్మా గాంధీ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం తీవ్రమైనదీ, ఆశాభంగం కలిగించేదీ అయినా జవాహర్‌లాల్ గాంధీ మార్గనిర్దేశానికే కట్టుబడ్డాడు. ఆ నిర్ణయంతో దెబ్బతిన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడం జవాహర్‌కి చాలా కష్టమైంది.

యునైటెడ్ ప్రావిన్సుల్లో రాట్నం తిప్పడం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి నిర్మాణాత్మక కార్యక్రమాల్లోనూ, గాంధీ స్వరాజ్య కార్యక్రమాలను ప్రచారం చేయడంలోనూ గడిపేవాడు. అప్పటికే మహాత్మా గాంధీని అరెస్టు చేసి, జైలు శిక్ష విధించిన ప్రభుత్వం తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడసాగింది. ఈ నిర్బంధాల మధ్య నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా సాగడం కష్టమయ్యేది.

1922 మే 12న పికెటింగ్ జరుపుతూ, దాన్ని ప్రచారం చేస్తున్నాడన్న కారణంతో జవాహర్‌లాల్‌ని అరెస్టు చేశారు. సహాయనిరాకరణ ఉద్యమ కార్యాచరణలో భాగంగా న్యాయస్థానాలు విడనాడాలన్న సూత్రం అనుసరించి జవాహర్‌లాల్ తన తరఫున వాదించడానికి, క్రాస్ పరీక్ష చేయడానికీ అంగీకరించలేదు. కోర్టులో న్యాయమూర్తి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు సుదీర్ఘమైన ప్రకటన ఒకటి చేశాడు.

దానిలో తన దృక్పథాన్ని వివరిస్తూ, ప్రభుత్వ దమనకాండను నిరసించాడు. విదేశీ వస్త్రబహిష్కరణకు ఈ విధంగా ప్రాచుర్యం కలిగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు. మహాత్మాగాంధీ వంటి నాయకుని కింద దేశసేవ చేయడం భాగ్యమని తోటి భారతీయులకు ప్రబోధిస్తూ ముగించాడు. ప్రభుత్వం ఆశించని విధంగా విద్యావంతులైన భారతీయ యువతను జవాహర్ కోర్టు ప్రకటన ప్రభావితం చేసింది.

ఈసారి 18 నెలల కఠిన కారాగార శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టకపోతే మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అతనిని జైలుశిక్ష అనుభవించేందుకు లక్నో జైలుకు తరలించారు. ఆ జైలులో సందర్శకులను వేధిస్తారన్న చెడ్డపేరు ఉండడంతో స్నేహితులు, బంధువులను చూసే అవకాశం తానే వదులుకున్నాడు. జైలు జీవితం పేరిట బలవంతాన లభించే తీరికను జవాహర్ సద్వినియోగం చేసుకున్నాడు.

శారీరక వ్యాయామం, నూలు వడకడం, చరిత్ర, యాత్రా జీవనాలకు సంబంధించిన పుస్తకాలు చదవడం, ఉత్తరాలు రాయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యాడు. జైలు జీవితం తాలూకు కష్టాలు, ఇబ్బందులు అతనికి బాగా సంతృప్తి కలిగించాయి. దేశం కోసం కష్టపడుతున్నందుకు ఒకవిధమైన సంతృప్తి చెందేవాడు. జైలు నుంచి విడుదల కోరుకోవట్లేదని ఒక లేఖలో జవాహర్‌లాల్ రాశాడు. అందుకు భిన్నంగా యునైటెడ్ ప్రావిన్సుల శాసన మండలి తీర్మానాన్ని అమలు చేస్తూ శిక్ష పూర్తికాకుండానే 1923 జనవరి 31న సార్వత్రిక క్షమాభిక్షలో భాగంగా జవాహర్ శిక్షాకాలం ముగిసింది.

విడుదల కాగానే కాంగ్రెస్ పార్టీ శాసనసభల్లో ప్రవేశించాలనే వారు, ప్రవేశించరాదనే వారి మధ్య చీలిపోయి ఉంది.

ప్రవేశించాలనే మితవాద పక్షంలో తన తండ్రి మోతీలాల్ సహా తనకు సన్నిహితులు ఉన్నారు. స్వతాహాగా జవాహర్‌కి సహాయ నిరాకరణను తిరగదోడి శాసనసభల్లో చేరడం చేపట్టడం ఇష్టం లేదు. కానీ ఈ చీలికల విషయంలో సంస్థ దెబ్బతింటుందని కలతపడ్డాడు. సహాయ నిరాకరణమే స్వరాజ్యానికి మార్గమన్న తన విధానాన్ని పునరుద్ఘాటించినా శాసనసభల ప్రవేశం విషయంలో అప్పటికి ఏ అభిప్రాయం వ్యక్తం చేయలేదు.

ఇరుపక్షాలూ తమ ప్రచారాలు రెండు నెలలపాటు ఆపివేసేలా 1923 ఫిబ్రవరి మాసాంతంలో జరిగిన అలహాబాద్ సభలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌తో కలిసి ఇరుపక్షాలనూ జవాహర్ ఒప్పించాడు. తిరిగి మే నెలలో రెండు పక్షాల వారూ కలహానికి సంసిద్ధులయ్యే సరికి కాంగ్రెస్ చీలిక నివారించడానికి జవాహర్‌లాల్ ఓ రాజీ సూత్రాన్ని ప్రతిపాదించాడు. దాని ప్రకారం శాసనసభల్లో ప్రవేశించరాదని 1922 డిసెంబరులో జరిగిన నిర్ణయాన్ని కొట్టివేయరు, అలాగని ప్రచారమూ ఇవ్వరు.

అంటే సూత్రం అలానే ఉండనిచ్చి శాసనసభల్లో ప్రవేశించవచ్చని సారాంశం. ఇది శాసనసభల్లో ప్రవేశానికి ఆశిస్తున్నవారికే అనుకూలంగా ఉంది. ఈ తీర్మానం బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సైతం ఆమోదించింది. కానీ శాసనసభా ప్రవేశం ఇష్టంలేని ఆరుగురు సభ్యులూ రాజీనామా చేసి, ఆమోదించాలని పట్టుబట్టారు. ఆ దశలో చివరకు కమిటీలో ఏ పక్షానికి మొగ్గకుండా ఉన్న జవాహర్‌లాల్ వంటివారు ఉండాలని ఇరుపక్షాలూ అంగీకారానికి వచ్చాయి.

అయితే అతికొద్ది నెలల్లోనే ఈ రాజీ తీర్మానాన్ని పలు రాష్ట్ర కమిటీలు తిరస్కరించాయి. ఆ కమిటీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జవాహర్ పెట్టిన తీర్మానం వీగిపోవడంతో పార్టీ పదవులన్నిటికి రాజీనామా చేశాడు.

అయిష్టమైన పార్టీ కలహాల నుంచి రాజీనామాతో విముక్తి పొందిన జవాహర్‌లాల్ తిరిగి కార్యాచరణపై దృష్టిపెట్టాడు. నాగపూరులో జాతీయ జెండాతో ఊరేగింపును అనుమతించేందుకు జిల్లా మొజిస్ట్రేటు నిరాకరించడంతో జెండా సత్యాగ్రహం ప్రారంభమైంది.

దానిని వ్యవస్థీకరించి, ఎప్పటికప్పుడు స్థానిక కార్యకర్తలకు తోడుగా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తల బృందాలు వెళ్ళి ఊరేగింపుగా జెండాను తీసుకుపోతూ అరెస్టు అవుతూండేలా పంపుతూ వచ్చారు. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి జాతీయ జెండాను ఎగురవేసుకునేందుకు అనుమతి ఇచ్చేదాకా ఇది కొనసాగింది. ఆ తర్వాత అకాలీ ఉద్యమంలో ఆసక్తి కనబరిచి, క్రమేపీ ఆ ఉద్యమంలో మమేకమయ్యాడు.

పంజాబ్ రాష్ట్రంలోని సిక్ఖులకు గురుద్వారాల నిర్వహణలో సంస్కరణలు అమలు చేయాలని ప్రారంభించిన అకాలీల ఉద్యమం శాంతిభద్రతల సమస్య తెస్తుందని పంజాబ్ ప్రభుత్వం వారి ప్రయత్నాలు ప్రతిఘటించింది. అలా మతసంస్కరణల ఉద్యమం రాజకీయ ఉద్యమమై, మహాత్మా గాంధీ ప్రబోధించిన అహింసా సిద్ధాంతం స్వీకరించి ప్రభుత్వాన్ని ఎదిరించసాగారు. 1923 జూన్, జూలైల్లో వారి సభల్లో పాల్గొనడంతో ప్రారంభించి క్రమేపీ సెప్టెంబరు నాటికల్లా అకాలీలతో కలిసి అప్పుడప్పుడే పదవీచ్యుతుడై, సంస్థానం కోల్పోయిన సిక్ఖు సంస్థానాధీశ్వరుని ప్రాంతం- నాభా సంస్థానం వెళ్ళాడు.

అధికారులు అప్పటికే సంస్థానంలో ప్రవేశించిన జవాహర్‌లాల్‌ని సంస్థానంలో ప్రవేశించవద్దన్న ఉత్తర్వు చూపించి, దానిని ఉల్లంఘించాడంటూ అరెస్టు చేశారు. జవాహర్‌లాల్‌నీ, అతని స్నేహితులనీ ఒకే గొలుసులకు కట్టివేసి, జనంతో కిక్కిరిసిన మూడో తరగతి రైలు పెట్టెలో నాభా పట్టణం తీసుకువెళ్ళి దారుణమైన స్థితిగతులు ఉన్న నాభా జైలులో నిర్బంధించారు.

అతనిపై నేరారోపణలు అసంబంద్ధంగా ఉండడంతో సిక్ఖుల జాథాలలో ఉన్నాడనీ, వారంతా దౌర్జన్యం చేశారనీ అక్రమ కేసు బనాయించారు. కేసు నత్తనడకన సాగుతూండగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం కలగజేసుకుని కొన్ని సూచనలు చేసింది. తదనుగుణంగా నిందితులకు 30 నెలల కఠిన కారాగార శిక్ష విధించి, వెనువెంటనే నిలిపివేసి, సంస్థానాన్ని విడిచి వెళ్ళి తిరిగి రావద్దన్నారు.

వ్యక్తిగత సమస్యలు, మున్సిపల్ పరిపాలన (1924-1926)

నాభా జైలు నుంచి తిరిగివచ్చాకా జవాహర్‌లాల్ ఉత్సాహలేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు తీసుకురావడం ఎలాగన్న ప్రశ్నపై సతమతమయ్యాడు.

అప్పటికి జవాహర్‌ భావాల్లో సామ్యవాదం వంటివేమీ జొరబడలేదు, గాంధేయవాదానికే పూర్తి నిబద్ధునిగా ఉండేవాడు. కాకినాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగిస్తూ - "భారతీయ స్వచ్ఛంద సేవకులకూ, పాశ్చాత్య దేశాల వలంటిర్లకూ మధ్య ఉభయ సామాన్యమైన విశేషం అంతగా లేదు. భారతీయ స్వచ్ఛంద సేవక సంస్థకు అహింస ప్రాథమిక సూత్రమై ఉండాలి.

భారతదేశానికి అహింసను, క్రమశిక్షణను పాటించే సైనికులు అవసరమై వున్నారు" అంటూ అవే భావాలు గాంధీయమైన భాషలోనే వెల్లడించాడు. జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ముగ్గురిలో ఒకనిగా జవాహర్‌లాల్ పార్టీ నిర్వహణా భారాన్ని, అనుసంధాన కార్యకలాపాలను చాలావరకూ భుజాన వేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ద్రవ్య వ్యవహారాలు, అకాలీ ఉద్యమాన్ని జాతీయోద్యమంతో అనుసంధానం చేసే కార్యకలాపాలతో తీరికలేకుండా పనిచేయసాగాడు.

ఖిలాఫత్ ఉద్యమ స్ఫూర్తి నానాటికీ దెబ్బతింటూ దేశంలో హిందూ-ముస్లిం మత విద్వేషాలు రెచ్చిపోసాగాయి.

1924 ఫిబ్రవరిలో బ్రిటీష్ వారు ఆరోగ్యకారణాలతో విడుదల చేసిన గాంధీ సెప్టెంబరు నాటికి ఈ మతవిద్వేషాలు సమసిపోవాలంటూ 21 రోజుల ఉపవాస దీక్ష తీసుకున్నాడు. జవాహర్‌లాల్‌ను ఆ వార్త చాలా బాధించింది. అది తెలిసేనాటికే మతకలహాలు తగ్గించేందుకు, వాస్తవ స్థితిగతులు తెలుసుకునేందుకు పర్యటనలు చేస్తున్నాడు. హిందూ-ముస్లిముల నడుమ ఐక్యత సాధించే మార్గాన్వేషణకు యుపిలో ప్రతీ పట్టణంలో, ప్రతీ గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు, స్వయంగా ఢిల్లీలో ఐక్యతా మహాసభలో పాల్గొన్నాడు.

అలహాబాద్‌ నగరంలో జరిగిన మత ఘర్షణల వివరాలను సేకరించి, గాంధీకి నివేదిక పంపాడు. మత ఘర్షణలు జవాహర్‌లాల్‌ మనస్సును చాలా గాయపరిచాయి. 1925 జనవరిలో ఈ అంశంపై జరిగిన అఖిల పక్ష మహాసభ విఫలమైంది. ఈ సభలో జరిగిన చర్చ వినాల్సిరావడమే అతనికి ఎంతో బాధాకరంగా పరిణమించింది. అతని ఉద్దేశంలో ఇది అవాస్తవికమైన, ఊహాత్మకమైన అంశాల చుట్టూ అల్లుకుపోతూండే సమస్య, కనుకనే ఈ సమస్యపై శక్తివంతమైన చర్యలు తీసుకోలేకపోయాడు.

ఈ పరిస్థితులకు తోడు జవాహర్‌లాల్ సాంసారిక జీవితంలో కూడా పుట్టిన కుమారుడు పుట్టగానే చనిపోవడం, భార్యకు క్షయవ్యాధి పట్టుకోవడం, తాను ఆర్థికంగా ఆధారపడి ఉన్న తన తండ్రితో రాజకీయంగా వివాదాలు రావడం వంటి సమస్యలు చుట్టుముట్టాయి.

తండ్రిపై ఆర్థికంగా ఆధారపడకూడదని నిర్ణయించుకోవడంతో గాంధీ అతనికి పత్రికా విలేఖరిగా కానీ, కళాశాలలో ప్రొఫెసర్‌గా కానీ పని ఏర్పాటుచేయాలని ప్రయత్నించి చూశాడు. ఆపైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వేతనం స్వీకరించాలని గాంధీ అభ్యర్థించినా జవాహర్‌లాల్ అంగీకరించలేదు. తన పలుకుబడితో బొంబాయిలో టాటా సంస్థ మేనేజరు పదవి ఇప్పించాలని గాంధీ ప్రయత్నించగా, టాటా వారు సిద్ధపడినా జవాహర్‌కు అందుకు మనస్కరించలేదు.

చివరకు భార్య కమల ఆరోగ్యం కోసం ఐరోపా పర్యటన చేయడానికి తప్పనిసరి స్థితిలో తనకేమాత్రం ఇష్టంలేని న్యాయవాది వృత్తి ఒకమారు చేపట్టాల్సివచ్చింది. తండ్రే కక్షిదారును తీసుకునివచ్చాడు. అతనికి న్యాయవాదిగా ముట్టింది రూ.పదివేలు కాగా ఆ వచ్చిన కక్షిదారు కూడా జవాహర్‌లాల్ వల్ల కాకుంటే మోతీలాల్ అయినా కేసు గట్టెక్కించకపోడని వచ్చాడు.

నా ప్రియతమ నాయకుడు (గాంధీ) జైలులోపల మ్రగ్గుతూ ఉండగా నా సమయంలో అధిక భాగాన్ని ఏ పదవిలోనూ వ్యయపరచదలుచుకోలేదు.

నాకు చేతనైనప్పుడల్లా యుద్ధం చేస్తాను. నాకు వీలైనప్పుడల్లా పోరాడుతాను, బలంగా దెబ్బతీస్తాను, స్వరాజ్యం వచ్చేదాకా అదే నా ముఖ్యమైన పని. తక్కినదంతా శిక్షణ, తయారీ.

— యుపి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా జవాహర్‌లాల్ నెహ్రూ 1923 ఏప్రిల్ 5న కాంగ్రెస్ కమిటీలకు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులకు పంపిన సర్క్యులర్‌లో భాగం.

సహాయ నిరాకరణోద్యమ విరమణ తర్వాత ఐరోపా ప్రయాణంలోపు సంక్షుభిత సంవత్సరాల్లో జవాహర్‌ జీవితంలో చెప్పుకోదగ్గ విశేషం - అలహాబాద్ పురపాలక సంఘ అధ్యక్షునిగా చేసిన కృషి.

1923 ఏప్రిల్ నుంచి 1925 ఏప్రిల్ వరకూ ఈ పదవిలో ఉన్న జవాహర్ పరిపాలనలో తొలి అనుభవాన్ని ఇక్కడే గడించాడు. సర్వేపల్లి గోపాల్ ఉద్దేశంలో తర్వాతి కాలంలో ప్రధానమంత్రిగా నెహ్రూ కనబరిచిన "సహచరులపై తన ప్రాబల్యం చూపడం, సామర్థ్యాన్ని అభిలషించడం, సమర్థులైన తన క్రింది అధికార్ల పట్ల విడవని విశ్వాసం చూపడం, కొత్త ఆలోచనలతో అన్ని దిక్కులా ముందుకు సాగిపోయేందుకు గట్టిగా ప్రయత్నించడం వంటి లక్షణాలు" బీజప్రాయంగా అలహాబాద్ పురపాలక సంఘంలో చేసిన పనిలో చూడవచ్చు.

పదవి చేపట్టినందుకు శక్తివంచన లేకుండా పనిచేసినా అతను ఏనాడూ దీనికి స్వరాజ్యం కోసం చేసే పోరాటం కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదలుపెట్టినప్పుడు అయిష్టమైనదైనా పరిపాలనా వ్యవహారాలు క్రమేపీ అతని ఆసక్తిని చూరగొన్నాయి. పురపాలక సంఘ సభ్యుల అలసత్వం, క్రమశిక్షణా రాహిత్యం పదవిలోకి వచ్చిన తొలినాళ్ళలోనే బహిరంగ విమర్శలతో తొలగించి, క్రమశిక్షణ నెలకొల్పాడు.

చిన్న చిన్న అంశాలకు స్వరాజ్య విధానంతో ముడిపెట్టి పట్టుపట్టేవారు స్వంత పార్టీ సభ్యులే అయినా అంగీకరించేవాడు కాదు. ఆంగ్లేయులపై నిష్కారణంగా ప్రతీకారం చూపే విధానాలనూ సమర్థించలేదు. అవసరమైనప్పుడు, తగినంత స్థాయి ఉన్న విధానాలలో కాంగ్రెస్ విధానాల దృష్ట్యా నడుచుకునేవాడు. బ్రిటీష్ వస్తువుల బహిష్కరణ, పాఠశాలల్లో నూలు వడకడం, కాంగ్రెస్ నాయకులకు సన్మానం, తిలక్ వర్థంతి, గాంధీకి శిక్షవేసిన రోజు జ్ఞాపకార్థంగా గాంధీ దినోత్సవం సెలవులు ఇవ్వడం వంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినా ఖాతరుచేయకుండా నిర్వహించాడు.

ప్రజలకు మేలుచేకూర్చే పలు నిర్ణయాలు, క్రమం తప్పకుండా ప్రజలకు నివేదికలతో పారదర్శకత పాటించడం వంటి అనేక చర్యలు చేపట్టాడు. ప్రత్యక్షంగా కనిపించే న్యాయబుద్ధి, నీతి, నిజాయితీలతో పురపాలక సంఘ వ్యవహారాల్లోని అన్ని పక్షాల వారిలోనూ పలుకుబడి, ప్రాభవం సంపాదించాడు. కమీషనర్ కూడా మునిసిపల్ వ్యవహారాలు మెరుగుకావడం వెనుక జవాహర్‌లాల్ కృషిని ప్రస్తావించాల్సిన స్థితి తీసుకువచ్చాడు.

అయితే పురపాలక వ్యవహారాలు కేవలం గృహవసతి, పారిశుధ్యం వంటి అంశాలకే పరిమితమై విశాలమైన అర్థంలో సాంఘిక సంక్షేమాన్ని తమ పరిధిగా ఎంచే వీలులేకపోవడం, ఆ రంగంలో కృషిచేయలేకపోవడం అతనికి సంతృప్తి కలిగించలేదు. 1925 ఏప్రిల్‌లో పార్టీ కార్యకలాపాల దృష్ట్యా బోర్డు పనులు చూడడానికి వీలుచిక్కడం లేదంటూ మునిసిపల్ బోర్డు ఛైర్మన్ పదవికీ, బోర్డు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు.

ఐరోపా పర్యటన, నూతన రాజకీయ భావాల అంకురం (1926-1927)

జవాహర్‌లాల్ 1926 మార్చి 1న భార్య కమల, కుమార్తె ఇందిరలతో బయలుదేరి ఐరోపా చేరుకున్నాడు.

జెనీవాలో ఒక చౌక బసలో స్థిరపడ్డాడు. క్షయవ్యాధితో బాధపడుతున్న భార్య కోలుకునేందుకు ప్రధానంగా ఈ ఐరోపా నివాసం. అయితే అది ఆమె మీద ప్రభావం ఏమీ చూపించకపోగా జవాహర్‌లాల్ రాజకీయ, ఆర్థిక భావాలలో విప్లవాత్మకం అనదగ్గ పరిణామం తీసుకువచ్చింది. మరోవైపు భారతదేశంలో జాతీయవాద రాజకీయాల పరిస్థితి దారుణంగా తయారైంది. మతసామరస్యం లోపించి మతకల్లోలాలు వ్యాప్తిచెందుతూ ఉన్న వార్తలు జవాహర్‌కు అందుతూండేవి.

ఈ వార్తలు ఆయనను కుంగతీసేవి. మతాన్ని అదుపులోకి తెచ్చుకుని, రాజకీయాలను లౌకిక తత్వం వైపు మళ్ళించడమే దీనికి పరిష్కారమని భావించేవాడు. ఈ దశలో అతను బౌద్ధికమైన పనులు కాక చేసినవి భార్యకు సేవ, కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్ళి, తీసుకురావడం. అంటే అతని కార్యాచరణయుతమైన జీవితంలో అధ్యయనానికి బోలెడంత ఖాళీ దొరికినట్టు. ఫ్రెంచి భాష నేర్చుకోవడం, బహు గ్రంథ పఠనం, వివిధ కోర్సులకు, ఉపన్యాసాలకు హాజరుకావడం వంటి పనులతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

విస్తారమైన అధ్యయనం వల్ల ఆయన మనస్సు, బుద్ధి నూతన సిద్ధాంత బీజాలకు సిద్ధంగా ఉంది. ఆ ఏడాది ముగిసేనాటికి కమల ఆరోగ్యంపై ఐరోపా నివాసం మెరుగదల ఏమీ చూపించడం లేదని తేలిపోయింది. మోతీలాల్ కూడా ఐరోపా పర్యటనకు వస్తూండడంతో ఇక జవాహర్ కుటుంబం ఐరోపా ఖండాన్ని సందర్శించింది. ఈ సందర్శన జవాహర్‌లాల్ అధ్యయనానికి, ఐరోపా రాజకీయవేత్తలతో పరిచయాలు, వారి ఉద్యమాల పట్ల అవగాహన కలిగించి, తర్వాతికాలపు జవాహర్ ఆలోచనల్లో వినూత్నమైన గాఢత్వాన్ని కల్పించింది.

1927 ఫిబ్రవరిలో బ్రస్సెల్స్‌లో వలసపీడన, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా జరిగిన అంతర్జాతీయ మహాసభలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా జవాహర్‌ అధ్యక్ష మండలి సభ్యుడి హోదాలో పాల్గొన్నాడు. సమావేశాల్లో వక్తగా, ఇష్టాగోష్ఠి సభ్యునిగా, ఒక సమావేశానికి అధ్యక్షునిగా, తీర్మానాల ముసాయిదా రచయితగా పలు హోదాల్లో చురుకుగా పాల్గొన్నాడు. సమావేశంలోని పలువురు రాజకీయవేత్తల సాంగత్యం అతనిని ప్రభావితం చేసింది.

ఈ సమావేశాల్లో మాట్లాడుతూ జవాహర్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల్లో సాధారణాంశం వివరించాడు. భారతీయుల్లో విభేదాలు తీవ్రతరం చేయడం, ఫ్యూడల్ సమాజానికి చెందిన సంస్థానాధీశులను, భారతీయ భూస్వాములను కాపాడడం వంటి సామ్రాజ్యవాద ప్రబలమైన దృష్టాంతాలను భారతదేశంలో ఎత్తిచూపాడు. తొలిసారి జవాహర్ ఆలోచనల్లో రాజకీయ-ఆర్థిక అంశాల పరస్పర సంబంధం పట్ల స్పష్టత వచ్చింది.

అలా కేవలం బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ఖండించే జాతీయవాది స్థాయి నుంచి సామ్రాజ్యవాదపు ఉద్దేశాలు, తీరుతెన్నులు, అది పనిచేసే తీరును అవగాహన చేసుకోవడానికి తన రాజకీయ జీవితంలో తొలిసారి ప్రయత్నించాడు.

చైనా-భారత దేశ జాతీయవాద రాజకీయాల మధ్య సంబంధాలు ఏర్పడాలని ఆశించాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు చైనాకీ, భారతదేశానికి ఉండవలసిన సత్సంబంధాల విషయమై మారకుండా నిలబడిన జవాహర్ దృక్పథానికి పునాది మహాసభలోనే పడింది.

ప్రపంచ రాజకీయాలను కూడా చాలా సదవగాహనతో అంచనా వేశాడు. అప్పటికి చైనాలో జాతీయవాదులైన కూమిటాంగులు, కమ్యూనిస్టులు కలిసి బ్రిటీష్ సామ్రాజ్యవాదం, దాని ప్రభావంలో ఉన్న చైనా చక్రవర్తులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండగానే - చైనీయులకు విజయం సిద్ధిస్తే ఆసియాలో సోవియట్ మహా ప్రజాతంత్ర రాజ్యం ఏర్పాటైనట్టేననీ, చైనా-సోవియట్ రష్యా కలిసి ఆసియా, ఐరోపా ఖండాలపై ప్రాబల్యం చూపుతాయనీ, చైనాలోని రైతాంగ ఒత్తిడి వల్ల శుద్ధ కమ్యూనిజం నుంచి చాలామేరకు చైనీయ కమ్యూనిజం వైదొలగుతుందనీ భావించాడు.

మరోవైపు బ్రిటన్ ప్రపంచంలో తన స్థానాన్ని కోల్పోతోందని, పూర్తిగా కోల్పోకుండా అమెరికా ఉపగ్రహంగా అమెరికన్ పెట్టుబడిదారీ పక్షాన నిలిచి పోరాడవచ్చని గ్రహించగలిగాడు. బ్రిటన్ ఐరోపాదేశాలన్నిటి మద్దతూ తీసుకున్నా ఒక మహాఖండంలా ఉండబోయే చైనా-రష్యా ప్రభావాన్ని ఎదుర్కోవడం సులభసాధ్యం కాదనీ ఊహించాడు. 1927 నాటికే వీటన్నిటినీ గ్రహించి, కాంగ్రెస్ కార్యవర్గానికి రహస్య నివేదికలో పంపాడు.

క్రమేపీ దశాబ్దాల కాలంలో ఈ అంశాలన్నీ వాస్తవరూపం దాలుస్తూ ఉండడాన్ని అతని జీవితచరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ వ్యాఖ్యానిస్తూ ఇవన్నీ "జవాహర్‌లాల్ ... ప్రపంచ వ్యవహారాల్లో దూరదృష్టి కల రాజకీయ ప్రవక్తగా" నిలిపాయన్నాడు.

ఈ మహాసభ ఫలితంగా ఏర్పడ్డ సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్‌కు గౌరవ అధ్యక్షునిగా, కార్యనిర్వాహక మండలి సభ్యునిగా జవాహర్‌లాల్ ఎన్నికయ్యాడు.

లీగ్ మీద, మహాసభ మీద సోవియట్ రష్యా ప్రభావం పైకి కనిపించకుండా ఉండేది. దీన్ని గ్రహించినా ఉపేక్షించగలిగాడు. పీడిత జాతులతో సోవియట్ రష్యా తన ప్రయోజనం కోసం సన్నిహితంగా వ్యవహరిస్తోందనీ, ఇది మరో కొత్త సామ్రాజ్యవాదానికి సుదూర భవిష్యత్తులో దారితీయవచ్చుననీ అంచనా వేశాడు. 1927లో సోవియట్ రష్యా అక్టోబర్ విప్లవం దశమ వార్షికోత్సవాల సందర్భంగా సోవియట్ ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని అనుసరించి జవాహర్‌లాల్, మోతీలాల్ సోవియట్ రష్యాను సందర్శించారు.

సోవియట్ యూనియన్ చరిత్రలో సుఖశాంతులతో కూడిన మొదటి దశ ఆఖరు రోజుల్లో సందర్శించాడు. సోవియట్ యూనియన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు, వారు చూపించదలిచిన విషయాలు మాత్రమే చూస్తున్నామని తెలిసినా వ్యవసాయం, జైళ్ళ సంస్కరణ, స్త్రీల పట్ల ప్రవర్తన, అల్పసంఖ్యాకుల సమస్యల పరిష్కారం, నిరక్షరాస్యతా నిర్మూలన వంటి అంశాల్లో అభివృద్ధి త్వరితగతిన సాధించిందన్న అభిప్రాయానికి వచ్చాడు.

వ్యవసాయ ప్రధాన దేశం కావడం, విస్తారంగా నిరక్షరాస్యత వేళ్ళూనుకొని ఉండడం వంటి పోలికల వల్ల భారతదేశానికి చాలా విషయాల్లో సోవియట్ యూనియన్ బోధించదగ్గ అంశాలు అనేకం ఉంటాయని నమ్మాడు. ఇలా రష్యా అతని తొలి సందర్శనలో గాఢమైన ముద్రే వేసింది.

మొత్తానికి నిఖార్సైన గాంధీ శిష్యునిగా, గాంధేయవాద మూసలో ఆలోచించే యువకుడిగా 1926 తొలి నెలల్లో ఐరోపా బయలుదేరిన నెహ్రూ దాదాపు పూర్తి కమ్యూనిస్టుగా, అంతర్జాతీయ తత్వంతో భారతదేశ సమస్యలు ముడిపెట్టగలిగే ఆలోచనా విధానంతో విప్లవాత్మకమైన మార్పుతో 1927 తుదినాటికి భారతదేశానికి తిరిగివచ్చాడు.

పూర్ణ స్వాతంత్ర్య వాదం, ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్

గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ అప్పటి వరకూ ఉపయోగిస్తూ వచ్చిన స్వరాజ్యమనే పదాన్ని అధినివేశ ప్రతిపత్తి కోరడం అనే సాంకేతిక అర్థంలో వాడుతూ వచ్చారు. అధినివేశ ప్రతిపత్తి అన్నది బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూనే అంతర్గతంగా కొంత స్వతంత్రాన్ని పొందే ఒక ఏర్పాటు.

కాంగ్రెస్ వంటి సంస్థ అధినివేశ ప్రతిపత్తి కోసం పాకులాడడం ఐరోపా నుంచి వచ్చాకా జవాహర్‌లాల్‌కి నిరర్థకమని తోచింది. కాంగ్రెస్‌తో వీలైనంత త్వరగా సంపూర్ణ స్వాతంత్ర్యం తమ లక్ష్యం అని అంగీకరింపజేయడం కనీసం మొదటి మెట్టుగా తోచింది. అధినివేశ ప్రతిపత్తిలో విడిపోయే హక్కు ఉంటుందని చేసే వాదాల్లోని యుక్తి అతను అంగీకరించేవాడు కాదు.

అసలు అధినివేశ ప్రతిపత్తికి అంగీకరించడమే భారతదేశ మానసిక భ్రష్టత్వానికి నిదర్శనమని భావించాడు. ఇది ఐరోపాలో అతనికి కలిగిన నూతన రాజకీయ, ఆర్థిక చైతన్యానికి సరిగా సరిపోయే కార్యాచరణ అని తోచింది.

జవాహర్‌లాల్ మద్రాసు కాంగ్రెస్ మహాసభలో పూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదింపజేయగలిగాడు. పూర్ణ స్వాతంత్ర్యానికి రక్షణ, ద్రవ్య, ఆర్థిక విషయాలు, విదేశాంగ విధానంపై పూర్తి అదుపు అని తీర్మానంలో అర్థం చెప్పాడు.

అయితే ఈ తీర్మానాన్ని కేవలం జవాహర్‌లాల్‌ని సంతోషపరిచి, సంతృప్తుణ్ణి చేయడానికే గాంధీ ప్రధానంగా ఉద్దేశించాడు. కనుక కాంగ్రెస్ నియమావళిలో పూర్వ అర్థంలో స్వరాజ్యం అన్న పదమే కనిపిస్తుంది. అందుకే బ్రిటీష్ వారితో పూర్తి తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడని వారు కూడా కాంగ్రెస్‌లో కొనసాగ సాగారు. ఈ కారణాలన్నిటి దృష్ట్యా జవాహర్ నెగ్గించిన తీర్మానం పూర్తిగా పరిహాసాస్పదం అయింది.

మహాత్మా గాంధీకి కానీ, అప్పటికి నెహ్రూ రిపోర్టు రాస్తున్న మోతీలాల్‌కి కానీ పూర్ణ స్వాతంత్ర్యం అనే లక్ష్యం ఆమోదయోగ్యం కాదు.[61]

కాంగ్రెస్‌లో ఉంటూనే స్వాతంత్ర్యం కోసం ఒత్తిడి తీసుకువచ్చే పక్షంగా ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ నెలకొల్పాడు. జవాహర్ ఉద్దేశంలో ఈ లీగ్ కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాక స్వాతంత్ర్యానంతరం భారతదేశం పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రాతిపదికలు మార్చివేసి, రాజ్యాన్ని సహకార ప్రాతిపదికపై వ్యవస్థీకరించేందుకు పనిచేయాలి.

అంటే భారత స్వాతంత్ర్యంతో పాటుగా సామ్యవాద, ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వవాదం వంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి. దీనిని అంతర్జాతీయ వాదానికి ముడిపెడుతూ ఒక పెద్ద ప్రపంచ సహకార కామన్వెల్తుకు ఈ పరిణామాలు దారితీయాలని కూడా ఆశించాడు. తన ఉద్దేశాలను కాంగ్రెస్ నాయకత్వంలో చాలామంది ఆమోదించట్లేదని తెలిసిన జవాహర్ తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు.

జవాహర్ చేస్తున్న ఈ కార్యాచరణకు కాంగ్రెస్ వారెవరూ పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకపోవడంతో అతని రాజీనామా అంగీకరించలేదు. ఆ మాటకి వస్తే ఈ స్వాతంత్ర్యం అన్న డిమాండ్ అధినివేశ ప్రతిపత్తిని సాధించుకునేందుకు మంచి ఎత్తుగడగా వారు భావించారు.

ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ ఆశించిన లక్ష్యాలు చేరుకోలేకపోయింది. అందులో చేరినవారు ప్రధానంగా - గాంధీ వైఖరి పట్ల ఆగ్రహం ఉన్నవారు కొందరు, జవాహర్‌కి వస్తున్న పేరుప్రఖ్యాతులను తమ రాజకీయ ప్రాభవానికి వాడుకుందామనుకునేవారు మరికొందరు.

చివరకు 1929 ప్రారంభానికి కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా ఆమోదించడంతో అప్పటికి క్రియారహితంగా ఉన్న లీగ్‌ అస్తిత్వానికి కూడా కారణం కోల్పోయింది.

సైమన్ కమీషన్ బహిష్కరణ

ప్రధాన వ్యాసం: సైమన్ కమీషన్

మరికొన్ని రాజ్యాంగ సంస్కరణలు చేయడానికి భారతదేశ సంసిద్ధత పరిశీలించాలంటూ బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సైమన్ కమీషన్‌లో భారతీయులు ఎవరూ లేకపోవడాన్ని కాంగ్రెస్‌ భారతదేశాన్ని అవమానించడమేనని భావించింది.

సైమన్ కమీషన్‌ను బహిష్కరించడం, సైమన్ కమీషన్ ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టడం, హర్తాళ్ళు, ఊరేగింపులు నిర్వహించడం వంటి కార్యకలాపాలు నిర్ణయించుకుంది. జవాహర్‌లాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్త ఆందోళనలను సమన్వయం చేసి, నిర్వహించాడు. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పక్షాలను సమన్వయపరిచి కాంగ్రెస్ నిర్వహించిన హర్తాళ్ జవాహర్‌లాల్ ఆశించినదానికన్నా విజయవంతమైంది.

సైమన్ కమీషన్ పర్యటించిన ప్రతీ ప్రాంతంలోనూ ఊరేగింపులు, నిరసనలు ఎదురయ్యాయి. ప్రభుత్వం లాఠీఛార్జిలు, కాల్పులు చేశారు. లాహోరులో పంజాబ్ కాంగ్రెస్ నేత లాలా లజపత్‌రాయ్‌ను ప్రాణాలకు ముప్పువచ్చేలా కొట్టి చంపారు.

ఆ వెంటనే 1928 నవంబరు 30న కమీషన్ లక్నోకి ఈ నేపథ్యంలో రానుండడంతో నవంబరు 23, 24 తేదీల్లో పోలీసుల అనుమతితోనే ఊరేగింపులు నిర్వహించారు.

నవంబరు 28 తేదీన మరో ఊరేగింపు తీయబోగా ముందస్తు అనుమతి ఇచ్చిన పోలీసులు చిన్న కారణం వంక చూపి రద్దుచేశారు. పోలీసుల నిషేధాజ్ఞలు ఉల్లంఘించి కాంగ్రెస్ వారు ఊరేగింపు నిర్వహించగా లాఠీఛార్జి చేశారు. ముందస్తు అనుమతులు ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా ఆందోళన జరుగుతుందని వేరే పనిపై లక్నో నుంచి బయలుదేరిన జవాహర్ హుటాహుటిన తిరిగివచ్చాడు.

ముందురోజు పోలీసులు చేసిన పనికి ప్రతీకారంగా వారిని లక్ష్యపెట్టకుండా 30 తేదీన జవాహర్‌లాల్, గోవింద వల్లభ్ పంత్ నాయకత్వాన 12 మంది జట్టు ఊరేగింపుగా సభాస్థలానికి బయలుదేరారు. పోలీసుల లాఠీలతో ఆ జట్టును చెదరగొట్టబోయే క్రమంలో జవాహర్‌కి దెబ్బలు తగిలాయి. ఏదేమైనా జట్టు లొంగకపోవడంతో పోలీసులు వెన్నంటిరాగా సభాస్థలానికి చేరుకున్నారు. 30న సైమన్ కమీషన్ లక్నోకు వచ్చే సందర్భంలో జవాహర్‌లాల్ నాయకత్వాన నిరసన తెలపడానికి పెద్ద ఊరేగింపు సాగింది.

పోలీసులు వీరిపై తీవ్రమైన దాడిచేశారు. గుర్రాలతో తొక్కించడం, లాఠీలతో కొట్టడం చేయగా జవాహర్‌లాల్‌కి, ఇతర సహచరులకు గాయాలయ్యాయి. ఏదేమైనా వారు ప్రతీకారం చేయకుండా, వెనక్కితగ్గకుండా శాంతియుతంగా అక్కడే ఉండిపోయారు. ఈ సమయంలోనే ఒక విద్యార్థి వేషంలో పోలీసు ఏజెంటు అక్కడికి వచ్చి జవాహర్‌కి రెండు రివాల్వర్లు ఇవ్వజూపగా అతను మర్యాదగా నిరాకరించాడు.

గడచిన రెండు రోజుల్లో పోలీసులను విజయవంతంగా ఆందోళనకారులు ప్రతిఘటించడంతో వారి నాయకుడైన జవాహర్ మీద కక్షపూని అతన్ని మరింత ప్రమాదకరమైన, కాంగ్రెస్ మౌలిక లక్ష్యాలకు విరుద్ధమైన కేసుల్లో ఇరికించేందుకు చేసిన కుట్ర అది.

ఈ సంఘటనలో జవాహర్‌లాల్‌ను పోలీసులు గాయపరిచారన్న విషయం దేశమంతా పొక్కింది. ప్రజల్లో బ్రిటీష్ పాలన పట్ల, ఆగ్రహావేశాలు జవాహర్‌లాల్ మీద ప్రేమ పెల్లుబికాయి.

ఈ సంఘటన దేశవ్యాప్తంగా జవాహర్‌కి ఉన్న జనప్రియత్వం బోధపరిచింది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి, పూర్ణ స్వాతంత్ర్య ప్రకటన

మోతీలాల్ నెహ్రూ తయారుచేసిన నెహ్రూ రిపోర్టును 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతిపాదించినట్టుగా అధినివేశ ప్రతిపత్తితో సంతృప్తి పడడం జవాహర్‌కు సరిపడని సంగతి.

అయితే కాంగ్రెస్‌ను ఆ ప్రాతిపదికన చీల్చడం ఇటు జవాహర్‌కు, అటు గాంధీకి కూడా ఇష్టం లేదు. జవాహర్‌లాల్‌, సుభాష్ చంద్ర బోస్, తదితరులు కాంగ్రెస్‌ను చీల్చకుండా చూసేందుకు - రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం నెహ్రూ రిపోర్టును అంగీకరించి అధినివేశ ప్రతిపత్తిని ఇవ్వకపోతే కాంగ్రెస్ పూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరవచ్చని గాంధీ అన్నాడు. జవాహర్‌లాల్‌తో ఇంకొంత చర్చించాకా ఆ కాలావధిని ఏడాదికి తగ్గించారు.

ఏడాది పాటు అధినివేశ ప్రతిపత్తి కోరే అంశంపై రాజీని కమిటీ స్థాయిలో అంగీకరించిన జవాహర్‌‌లాల్, సుభాష్ చంద్ర బోస్ బహిరంగ సమావేశంలో వ్యతిరేకించడంతో నొచ్చుకున్న గాంధీ "మీరు మీ మాటపై నిలవకపోతే ఇక స్వాతంత్ర్యం పరిస్థితి ఏమిటి?" అని ఆక్షేపించాడు. అయితే జవాహర్‌లాల్ మనస్థితిలో పరిస్థితికి తలవంచినా, సాంకేతికంగా కూడా అధినివేశ ప్రతిపత్తికి రాయితీ ఇవ్వడం ఇష్టం లేదు.

అందుకే జవాహర్‌లాల్ ఏదోమేరకు అయిష్టంతో అంగీకరించినా, కనీసం కాగితంపై కూడా అధినివేశ ప్రతిపత్తి తనకు సమ్మతం కాదన్న విషయాన్ని చెప్పడానికి తీర్మానం ఆమోదించిన ఆఖరు సమావేశానికి హాజరు కాలేదు.

ప్రభుత్వం ఎలాగూ నెహ్రూ రిపోర్టును ఆమోదించి, అధినివేశ ప్రతిపత్తి ఇవ్వదన్న నమ్మకం ఉండబట్టి జవాహర్‌లాల్ 1929 సంవత్సరాన్ని రాబోయే పోరాటానికి ఉద్యమాన్ని, పార్టీని సంసిద్ధం చేసే తయారీ సంవత్సరంగా వినియోగించాలని ప్రయత్నించాడు.

రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయాల తనిఖీ, మెరుగైన పనితీరు కోసం సిఫార్సులు, కాంగ్రెస్ స్వచ్ఛంద సేవాదళాలైన హిందుస్తానీ సేవాదళ్, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వంటి పనులు చేపట్టాడు. 1929 మార్చిలో పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులను, కొందరు అమాయకులను కమ్యూనిస్టులు అన్న పేరిట అరెస్టు చేసి, పెట్టిన మీరట్ కుట్ర కేసు విషయంలో వారికి సహాయంగా వాదించడానికి, ఆ కేసు నడిపించేందుకు నిధులు వసూలు చేయడానికి పనిచేశాడు.

ఈ దశలోనే జవాహర్‌లాల్‌ మీదా కేసు పెట్టాలని ప్రయత్నించినా ప్రత్యక్ష సాక్ష్యం లేనందున, జాతీయోద్యమం నుంచి కమ్యూనిస్టులను వేరుపరచాలన్న భావన ఉన్నందున అతనిపై ప్రభుత్వం కేసు పెట్టలేదు.

1929లో కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి బార్డోలీ సత్యాగ్రహాన్ని విజయవంతం చేసి బార్డోలీ హీరోగా పేరొందిన వల్లభ్ భాయి పటేల్‌ను ఐదు స్థానిక కాంగ్రెస్ కమిటీలు ప్రతిపాదించాయి, జవాహర్‌ను మూడు కమిటీలే ప్రతిపాదించాయి.

అయితే రానున్న శాసనోల్లంఘనకు పూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరే, యువకుడిని అధ్యక్ష స్థానంలో ఉంచితేనే మంచిదని వృద్ధ నాయకత్వం భావించింది. ప్రత్యేకించి మహాత్మా గాంధీ అధ్యక్ష స్థానానికి జవాహర్‌లాల్‌ ఉండాలని పట్టుబట్టాడు. సుభాష్ చంద్ర బోస్, జవాహర్‌లాల్ నెహ్రూ వంటివారి వామపక్ష భావాలు, స్వతంత్రం గురించి అభిప్రాయాలు తెలిసి ఉండడంతో జవాహర్ అధ్యక్షుడు అయితే సంస్థలో ఐకమత్యాన్ని సాధించడమే కాక అతనిని కూడా అదుపులో ఉంచవచ్చని గాంధీ భావించాడు.

రాజాజీ గాంధీని అధ్యక్ష స్థానానికి ప్రతిపాదించాడు. అయితే ఆ పదవిలో జవాహర్ ఉంటే తాను ఉన్నట్టేనని కూడా ప్రకటించాడు. అయితే జవాహర్‌కు ఈ పదవిని స్వీకరించడం ఇష్టం లేదు. కుమారుడు అధ్యక్ష పదవి చేపట్టాలని లోపల ఎంతవున్నా, జవాహర్ విముఖత చూసి మోతీలాల్ గాంధీకి నచ్చజెప్పబోయాడు. అయితే చివరకి జవాహర్‌లాల్ తన పట్టు వదులుకుని అంగీకరించగా, 1929 సెప్టెంబరులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జవాహర్‌ను కాంగ్రెస్ అధ్యక్షునిగా సంశయిస్తూనే ఎన్నుకుంది.

వైశ్రాయ్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ దృఢవైఖరి అవలంబించకపోవడంతో పదవి చేపట్టిన కొద్ది నెలలకే జవాహర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోయాడు.

అయితే కాంగ్రెస్-వైశ్రాయ్‌ల నడుమ జరిగిన సంప్రదింపులు పూర్తిగా విఫలం కావడంతో జవాహర్ వైఖరే సరైనదని నిర్ధారణ అయ్యి పార్టీ అంతా అతని వైఖరినే అవలంబించారు. రాజీనామా అగత్యం తప్పిపోయింది. జవాహర్‌లాల్ లాహోరు కాంగ్రెస్ అధ్యక్షత వహించేనాటికి అతని వైఖరి పట్ల ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి పూర్ణ స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ లక్ష్యంగా అంగీకరించడం అనివార్యమే అయింది.

అధ్యక్షోపన్యాసంలో జవాహర్‌లాల్ తాను సామ్యవాదిని, ప్రజాస్వామ్యవాదిని అని సుస్పష్టంగా చెప్పాడు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి వ్యవస్థీకృతమైన హింసకు దిగడానికి కాంగ్రెస్‌కు సాధన సంపత్తి కానీ, శిక్షణ కానీ లేవనీ, వ్యక్తిగతమైన హింసాత్మక చర్యలు నిరాశా నిస్పృహలను వెల్లడించడం తప్ప మరేం చెయ్యవనీ, కాబట్టి పన్నుల చెల్లింపు నిరాకరణ, సార్వత్రిక సమ్మెల రూపంలో శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ చేపట్టాలని పేర్కొన్నాడు.

భారత స్వాతంత్ర్య ప్రకటన

జవాహర్‌లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్య ప్రకటన చిత్తుప్రతిని తానే తయారుచేశాడు.

దీనిని లాహోర్ కాంగ్రెస్‌ ఆమోదించింది. ఇందులో ఒక భాగం ఇలా పేర్కొంటూంది:

స్వేచ్ఛ, శ్రమకు తగ్గ ఫలితాన్ని అనుభవించగలగడం, జీవితావసరాలు సంపాదించుకుని ఎదగడానికి అవకాశాలు పొందడం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల్లాగానే భారత ప్రజల మార్చలేని హక్కు. ఈ హక్కులను ఏ ప్రభుత్వం అయినా నిరాకరించి అణచివేస్తూంటే దాన్ని మార్చడానికి కానీ, ఆ ప్రభుత్వాన్ని రద్దుచేయడానికి కానీ ప్రజలకు హక్కు ఉంటుందని మేం నమ్ముతున్నాం.

భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వం కేవలం భారత ప్రజలకు స్వేచ్ఛను నిరాకరించడమే కాదు, దేశంలోని ప్రజలను దోపిడీ చేసి, భారతదేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా నాశనం చేస్తున్నది. దాంతో మేం నమ్మేదేంటంటే: భారతదేశం బ్రిటీష్ వారితో సంబంధాలు తెంపివేసుకుని, పూర్ణ స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్ర్యం సంపాదించాలి.[78]

1929 డిసెంబరు 31 అర్థరాత్రి నాడు జవాహర్‌లాల్ లాహోర్ నగరంలో రావి నది ఒడ్డున 3 లక్షల మంది చూస్తూండగా మువ్వన్నెల జెండా ఎగురవేశాడు.